13, అక్టోబర్ 2016, గురువారం

మా బుడ్డోడి పుట్టిన రోజు పార్టీ కబుర్లు

పార్టీ జరిగే రోజు ఉదయం చాలా మంది ఫోన్ చేసి 'డే లైట్ సేవింగ్' ఆ రోజు నుంచే మొదలయిన విషయం మరచిపోయామని అందువల్ల లేడవం కాస్త లేటయ్యిందని 12 గంటలకు కాకుండా కాస్త లేటుగా ఒంటి గంటకు వస్తాము అని చెప్పారు . 

అర్రే 'డే లైట్ సేవింగ్' మొదలవుతుందనే విషయం ముందుగానే అందరికి గుర్తు చేసి ఉంటే బాగుండేదని అనిపించింది, సరే ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని చాలా మందికి ఫోన్ చేసి నిద్ర లేపి బాబూ మీ గోడ గడియారాల టైం చూసుకోకుండా మీ ఫోన్ లో టైం చూసుకోండి పది అవుతోంది అని చెప్పాను.  గోడ గడియారాలైతే ఇంకా పాత టైం చూపిస్తూ ఉంటాయి అదే స్మార్ట్ ఫోన్స్, లాప్టాప్ లు, ట్యాబు లు అయితే డే లైట్ సేవింగ్' ప్రకారం ఒక గంట ముందుకు అప్డేట్ అయుంటాయి.

ఈ డే లైట్ సేవింగ్ అనే పద్దతి క్వీన్స్ లాండ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా లలో లేదు కానీ సిడ్నీ లో ఉంది. అక్టోబర్ నెలలో వచ్చే మొదటి ఆదివారం ఉదయం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2 AM ను ఒక గంట ముందుకు అనగా 3 AM  గా పరిగణిస్తారు/మార్చుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో వచ్చే మొదటి ఆదివారం ఉదయాన ఈ టైం ను మళ్ళీ సరిచేసుకుంటారు. ఈ పద్దతి దాదాపు 70 దేశాలలో అమలులో ఉంది. 1916 లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దీపాలకు వాడే ఆయిల్ ఖర్చు తగ్గించడానికి జర్మనీ లోఈ పద్దతి మొదలుపెట్టారు. దీని వలన ఉపయోగం ఏమిటంటే రాత్రి 8 గంటల టైం లో కూడా దీపాల అవసరం ఉండదు ఎందుకంటే ఒరిజినల్ టైం 7 కాబట్టి. ఎండాకాలంలో రాత్రి 7 వరకు సూర్యకాంతి/ వెలుగు ఉండటం మూలాన దీపాల అవసరం అంతగా ఉండదు.

ప్రతీ నాణేనికి రెండు వైపులున్నట్లే ఈ పద్దతి వలన కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి ముఖ్యంగా రైతులకు ఎందుకంటే ఏ కాలమైనా వాళ్ళ షెడ్యూల్ ను నిర్ణయించేది సూర్యుడు కానీ టైం కాదు. ఈ టైం చేంజ్ వలన షిప్పింగ్ షెడ్యూల్స్ మీట్ అవ్వడానికి లేదా షాప్స్ కు పాలు చేరవేయడానికి ఉదయం 5 గంటలకు పాలివ్వవలసిన ఆవులు 4 గంటలకే ఇవ్వాల్సి వస్తుంది. అందుకే కొంత మంది రైతులు ఈ పద్దతి ని ఇష్టపడరు.

నా వరకైతే నేను ఈ పద్దతి ఇష్టపడతాను ఎందుకంటే ఇంటికి సాయంకాలం 7 కు వెళ్లినా ఇంకా బోలెడు వెలుతురు ఉంటుంది కాబట్టి పిల్లలను పార్క్ కో లేదా బీచ్ కో తీసుకెళ్లి ఆడించవచ్చు. డే లైట్ సేవింగ్ గురించి ఇంతకంటే ఎక్కువ రాస్తే చదివే వాళ్ళు నన్ను తిట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడితో ముగిస్తాను.

ఈ కారణంతో అందరూ ఒంటి గంటకు రావటం తో కేక్ కట్టింగ్ కాస్త లేటయ్యింది.  కడుపు కూటికేడిస్తే - కొప్పు పూలకేడ్చిందన్నట్లు పిల్లలందరూ కేకు తినాలని ఉబలాట పడుతుంటే, ముందు పెద్దలందరూ వాళ్ళ పిల్లలతో కలిసివచ్చి ఫొటోస్ దిగిన తర్వాతే కేక్ అని మా ఆవిడ వాళ్లకు సర్దిచెప్పింది.

బార్బర్ దృష్టి అందరి జుట్టుమీద, చెప్పులు కుట్టేవాడి దృష్టి నడుస్తున్న వాళ్ళ కాళ్ళ మీద అన్నట్లు ఆ హోటల్ వాడి దృష్టంతా తినే వాళ్ళ మీదే ఉంది ఎవరెక్కువ తినేస్తారేమో అన్నట్లు మరీ ముఖ్యంగా మా ఫ్రెండ్ ఒకతని మీద. తనకు తిండి విషయం లో నో లిమిట్స్ అందుకని అతను అడిగి మరీ ఐటమ్స్ తెప్పించుకుని తిన్నాడు. ఇక లాస్ట్ లో నాకు అర్జంట్ పని ఉంది వెళ్ళాలి అని అంటే కాసేపు ఆగు రసమలాయ్ ఉంది తెస్తారు అది తినేసి వెళ్ళు అన్నాను. పొట్ట లోకి రసమలాయ్ దూరే సందే ఉంటే ఇంకో రెండు చికెన్ ముక్కలే తినేవాడిని కదా పవన్ అన్నాడు నవ్వుతూ అంతటి నాన్-వెజ్ ప్రియుడు తను.

ఆహారానికి ముందు వ్యవహారానికి వెనుక ఉండాలి అనే సూత్రాన్ని పాటించే నేను ఆ రోజు మాత్రం పార్టీ కి వచ్చిన అందరినీ పలకరిస్తూ వాళ్ళు సరిగ్గా తిన్నారో లేదో కనుక్కునే పనిలో పడి పాటించలేకపోయాను.

ముందు రోజు నైట్ పార్టీ హాల్ కు వచ్చి కొన్ని బెలూన్స్ ఊదటం, బ్యానర్ కట్టడం లో హెల్ప్ చేసిన రాధిక గారికి, ఉదయాన్నే లేచి కార్ తీసుకువచ్చి షాప్ లో ఆర్డర్ చేసిన హీలియం బెలూన్స్ తీసుకురాడానికి హెల్ప్ చేసిన శ్రీలంకన్ ఫ్రెండ్ కు, ఆ బెలూన్స్ ను పార్టీ హాల్ లో అలంకరించడం లో హెల్ప్ చేయడానికి ఒక గంట ముందే పార్టీ హాల్ కి వచ్చిన తమిళియన్ ఫ్రెండ్ తుకారాం గారికి, అలాగే మేము పార్టీ హడావిడిలో బిజీ గా ఉంటే మా బుడ్డోడిని పక్కనే కూర్చోబెట్టుకొని వాళ్ళ అమ్మాయితో పాటు తనకి ఓపికగా తినిపించిన మలయాళీ ఫ్రెండ్ సింధు గారిని ఎలా మర్చిపోగలము.

చెడు ఉంటే చెవిలో చెప్పు మంచి ఉంటే మైక్ లో చెప్పు అంటారు కదా అందుకని మైక్ లేదు కాబట్టి బ్లాగ్ లో చెప్తున్నాను.  అడిగిందే ఆలస్యం అనుగ్రహించడం తమ స్వభావం అన్నట్లు సాయపడిన వీరందరికి ధన్యవాదాలు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు చెప్పవలసిన వ్యక్తి మరొకరున్నారు ఎవరో కాదు మా ఆవిడ. వెనకటికో పనిమంతుడు పందిరేస్తే పిచ్చుకలు వ్రాలగానే పడిపోయిందట, అలాంటి పనిమంతుడిని నేను.  డెకరేషన్ అంతా ముగిసి కాస్త రిలాక్స్ అవుదామని ఫ్యాన్ వెయ్యగానే గోడకు నేను అతికించిన బెలూన్స్ అన్నీ కింద పడిపోయాయి. అయినా కూడా ఓపికగా మళ్ళీ ఆ బెలూన్స్ అన్నీ గోడకు అతికించేసింది. బెలూన్ కలర్స్ నుంచి, బ్యానర్ కలర్ వరకు ప్రతి ఒక్క విషయం లో చాలా కేర్ తీసుకొని ఏ ఈవెంట్ మేనేజర్ కి తగ్గని రీతిలో అద్భుతంగా స్టేజి ని పార్టీ హాల్ ని డేకరేట్ చేసిందని వచ్చిన గెస్ట్ లతో మెప్పు కూడా పొందింది.













8 కామెంట్‌లు:

  1. మీ బాబు లాగే తన పుట్టినరోజు కబుర్లు కూడా బాగున్నాయి పవన్ గారూ!
    అలాగే సామెతలు కూడా.

    రిప్లయితొలగించండి
  2. బుజ్జి బాబుకి పుట్టిన రోజు జేజేలు!
    అమ్మ-నాన్నలకి, బుజ్జి బాబు అక్కకి - శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి
  3. మా కుటుంబం తరపున ధన్యవాదాలండి లలిత గారు.

    రిప్లయితొలగించండి