31, మే 2016, మంగళవారం

మే నెల కబుర్లు - కృష్ణ గారి సినిమా, మల్లన్న పరిచయం చేసిన సినిమా, మా పాప ముచ్చట్లు

నిన్న కృష్ణ గారి బర్త్ డే . ఒకప్పుడు ఆయనకు పెద్ద  ఫ్యాన్ ని నేను. ఆ తర్వాత చిరంజీవి ఫ్యాన్ గా మారాననుకోండి. అదో పెద్ద స్టొరీ దాని గురించి ఇంకొక్కసారి  ఎప్పుడైనా రాస్తాను. ఇప్పటికీ  కృష్ణ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం especially ఫైటింగ్ మూవీస్.నేను చిన్నప్పుడు అగ్ని పర్వతం సినిమాను కృష్ణ కోసం మా ఊరి ధియేటర్ లో వరసగా 3 రోజులు  చూసినట్లు గుర్తు మా అన్నఅయితే ఏకంగా ఊరిలో ఆడిన వారం రోజులు వరసగా చూసాడు కానీ  విజయశాంతి కోసం అని కాస్త పెద్దయ్యాక తెలిసింది.  

మా ఆఫీసు లో ఒక మల్లన్న (మలయాళం అన్న) ఉన్నాడు. మొన్న ఏదో మాటల సందర్భం లో మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించిన NO:20 Madras Mail అనే మలయాళం సినిమా గురించి చెప్పాడు. గూగుల్ చేస్తే దొరికిన  తెలుగు dubbed  version చూశాను. శ్రీను వైట్ల ఈ మూవీ చూసి inspire అయి రవితేజ తో వెంకీ  సినిమా తీసి ఉంటారనుకుంటా. రెండు సినిమాల్లోనూ మొదటి సగ భాగం లో కథ  ఒకే రకంగా ఉంటుంది.   

సోమవారం మా టీం లో ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యాడు. ఏదో మాట్లాడుతూ  పెళ్లి అయిందా అని అడిగాను అయింది నాలుగు సార్లు అన్నాడు. ఇక పిల్లల గురించి అడిగితే ఇంకేమి వినాల్సి వస్తుందో అని అక్కడితో ఆపేశాను.

మా పాప కు తెలుగు మాట్లాడటం వచ్చు కానీ ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా రాదు. మొన్న సాయంత్రం  నేను బాల్కనీ లో నిల్చుని మా బుడ్డోడికి చుక్కలు చూపిస్తూ దిక్కు మాలిన కథలు ఏవో చెప్తూ ఉంటే మా పాప  వచ్చి నాన్నా your life is calling అంది. ఏంటమ్మా !!  అన్నాను సరిగ్గా అర్థం కాక.  your life is calling from  the chicken అంది ఈ సారి మరింత ఇంగ్లీష్ పరిజ్ఞానము జోడించి . అప్పుడు ట్యూబ్ లైట్ వెలిగింది బుర్రలో కాదండి మా బాల్కనీ లో. నా భార్యామణి బాల్కనీ లో లైట్ వేసి నాతో  అంది అప్పటినుంచి  పిలుస్తున్నాను వినపడలేదా అని . అప్పుడు ట్యూబ్ లైట్ వెలిగింది నాకు ఈ సారి బుర్రలోనేనండోయ్  your wife  is calling from the kitchen కు వచ్చిన తిప్పలు ఇవి అని.

మా పాప ను పోయిన వారం నుంచే చైల్డ్ కేర్ కు పంపిస్తున్నాము. ముందు రోజు రాత్రి తన టాబ్ కి ఛార్జింగ్ పెట్టుకుంటోంది. ఎప్పుడూ ట్యాబు చూడడమే తప్ప ఛార్జింగ్ పెట్టని తనని అడిగాను ఎందుకమ్మా నువ్వే టాబ్ కు ఛార్జింగ్ పెడుతున్నావు  అని. స్కూల్ కు చార్జర్ తీసుకెళ్లడం ఎందుకు నాన్న అందుకే ఫుల్ గా ఇప్పుడే ఛార్జింగ్ పెడుతున్నాను  అంది . అమ్మా చిట్టీ!  చైల్డ్ కేర్ లో టాబ్ అలౌ చేయరు అక్కడే బోల్డన్ని టాయ్స్ ఉంటాయి వాటితో ఆడుకోవచ్చు అని చెప్పాను.  పెద్దలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉండటం, గ్రాండ్ పేరెంట్స్ మరెక్కడో ఉండటం తో  పిల్లలు ఈ విధంగా ట్యాబు కు అడిక్ట్ అవుతున్నారు . మన బాల్యంలో ఈ టాబ్ లు గట్రాలు లేకపోవడం మన అదృష్టం. 

ఈ వీకెండ్ మా పాప బర్త్ డే ఉంది. మా పాప తనకు వచ్చే బర్త్ డే గిఫ్ట్ ల కోసం ఎదురుచూస్తూ ఉత్సాహంగా ఉంది.  మేము వచ్చిన పిల్లలకు ఇవ్వవలసిన రిటర్న్ గిఫ్ట్ ల కోసం, కేకు ఆర్డర్ కోసం, బర్త్ డే decorations  కోసం షాపింగ్స్  కు వెళ్ళాలి .  ఆ పనులతో కాస్త బిజీ గా ఉంటాను కాబట్టి  త్వరలో ఒక రెండు మూడు  రోజులు ఈ బ్లాగ్ కు సెలవు ప్రకటించ బోతున్నాను. 



30, మే 2016, సోమవారం

వీలయితే నాలుగు కబుర్లు కుదిరితే చిన్నప్పుడు విన్న కథలు

నేనో బ్లాగ్ ఓపెన్ చేసానోచ్ అని నేను నా ఫ్రెండ్స్ కు చెప్దామనుకున్నాను . కానీ మొహమాటం గట్రా లేకుండా  'పని లేని మంగలి వాడు పిలిచి తల గొరిగాడు అన్నట్లు' నువ్వు కూడా ఈ బ్లాగ్స్ అవి రాస్తున్నావా  అని ఎగతాళి చేస్తారేమో అనుకొని ఎవ్వరికి చెప్పలేదు. కానీ నా మిత్రుడు ఒకడికి ఈ విషయం ఎలాగో తెలిసిపోయింది ఇంకేముంది almost అలాంటి మాటే అన్నాడు. నీకు పని తక్కువగా ఉంటే నా  పని కూడా చేసిపెట్టచ్చు కదా అని. కొత్తగా Onsite వచ్చిన మరొక మిత్రుడేమో ఇంటికి పోయి బ్లాగ్ రాసుకునే బదులు ఆఫీసు లోనే ఉండి ఇంకొంచం పని ఎక్కువ చేయొచ్చు కదా మేనేజర్ హ్యాపీ గా ఫీల్ అవుతాడు అని suggestion ఇచ్చాడు. పార్థా ఒక్కసారి Onsite వచ్చాక  'ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి దక్కుతుంది' అన్న సామెత చెప్పినట్లు extra వర్క్ చేయడం/చేయకపోవడం వలన ఎటువంటి ఉపయోగము ఉండదు అని గీతోపదేశం చేసాను.  

కాబట్టి మిత్రులారా ఏదో పొడిచేద్దామనో సాధిద్దామనో బ్లాగ్ రాయడం లేదు. ఇదేదో ఒక హాబీ లాంటిది అంతే. ఈ బ్లాగ్ లో సాహిత్యాల గురించో మరేదో  గొప్ప విషయాల గురించో భూతద్దం పెట్టి వెదికినా కనపడవు. ఏదో వీలయితే నాలుగు కబుర్లు కుదిరితే చిన్నప్పుడు విన్న కథలు రాస్తుంటాను. ఏదో కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు నా బ్లాగ్ నాకు ముద్దు. నా బ్లాగ్ పోస్టులు చదివిన వారు ఏవైనా తప్పులు కనిపించినపుడు  సరిదిద్దితే సంతోషిస్తాను.

చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు నా గురించి. శతకోటి లింగాల్లో నేనొక బోడిలింగాన్ని. అబ్దుల్ కలాం గారు అన్నట్లు నాదింకా ఒట్టి సిగ్నేచరే, ఆటోగ్రాఫ్ ఇచ్చే స్టేజి కి వెళ్లాలని ఆశ. మరీ పెద్ద ఆశ అంటారా ఆశ పడటం లో తప్పు లేదు కదా. పెద్దాయనే చెప్పారు కదా కలలు  కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడండి అని. 

చివరిగా మంగలి వాడు అనే మాట ఎవరి మనోభావాలను అయినా కించపరిచింది  అని అనిపిస్తే మన్నించగలరు.  


29, మే 2016, ఆదివారం

మా ఇంటికి వచ్చిన అతిధి వారానికి కానీ వెళ్ళలేదు

ఎవరి పేరు చెబితే జనాలు భయపడి పారిపోతారో, ఎవరి పేరు చెబితే జనాలు  గాలి పీల్చడం కూడా కాసేపు ఆపేస్తారో అతను మేము పిలవకపోయినా పోయిన వారం మా ఇంటికివచ్చాడు. అతిధి మా ఇంటికే కాదు ఒకే టైం లో శ్రీ కృష్ణ పరమాత్మునిలా లోకమంతటా అందరి ఇళ్లనూ చుట్టేస్తుంటాడువచ్చేవాడు ఒక్కడే రావచ్చు కదా అలా రాడండోయ్ మొహమాటం గట్రాలు అస్సలు లేవు కాబట్టి గర్ల్ ఫ్రెండ్స్ ను కూడా వెంటబెట్టుకు వచ్చేసాడు. మేము అతన్ని సాదరంగా ఆహ్వానించకపొయినా అతనికి చనువెక్కువ కాబట్టి  ఇంట్లో అందరిని పలకరించే వెళ్ళాడు పాపం మాటలు రాని మా చంటోడ్ని కూడా పలకరించేసాడు. దాంతో చంటోడు అతనికి భయపడి పగలు మా చంక దిగకపోవడాలు, రాత్రి పూట నిద్రపోకుండా ఆరున్నొక్క రాగాలు తీయడాలు  జరిగింది గత వారం రోజులుగా

అతిధి ని జలుబు, పడిసం, రొంప అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతొ పిలుచుకుంటూ ఉంటారు. మా ఆవిడయితే  దానికో బిరుదు తగిలించి 'గబ్బు జలుబు' అని గౌరవిస్తూ ఉంటుంది. తను ఇంతవరకూ గబ్బు అని బిరుదు తగిలించాకుండా పలకడం నేనింతవరకూ వినలేదు.  

పడిసం పది రోగాల పెట్టు అని పెద్దలు ఊరికే అనలేదు. పడిసం ఒక్కటి పట్టిందంటే జ్వరం, వొళ్ళు నొప్పులు, తల నొప్పి, దగ్గు ఇలాంటివన్నీబంపర్ ఆఫర్ స్కీం కింద ఫ్రీ గా వచ్చేస్తాయివెధవ జలుబు మందులు వాడితే  వారం రోజుల్లో వాడకపోతే  ఏడు రోజుల్లో పోతుంది అనే సామెతను నేను బలంగా నమ్మినా  కూడా మరీ పిల్లల విషయం లో మనం మందులు, చిట్కా వైద్యాలు వాడకుండా ఉండలేము కదా అయినా కూడా సామెత ప్రకారమే  మందులు వాడినా వారానికి తగ్గింది

జలుబు అనేది మేకలకు కూడా వస్తుందని  ఎక్కడో చదివాను. మరి మిగతా ప్రాణులకు, aliens కు, దేవతలకు కూడా వస్తుందేమో మరి తెలియదు. పోకిరి సినిమా టైం లో మహేష్ బాబు కు కూడా వచ్చి ఉంటుంది ఇదేదో బాగుందని హీరో characterization కింద మార్చి ఉంటాడు పూరి జగన్నాధ్. 

శీతాకాలంలో జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు ఎక్కువగా వుంటాయి కదా వీటిని తగ్గించడానికి సనాతన వైద్య విధానం ఒకటి చైనాలో ఇంకా ఆచరణలో ఉందని గూగుల్ చేస్తే తెలిసినది . వీటి నివారణకు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో మద్యంతో తడిపిన క్లాత్ను మండించి, రోగి శరీరభాగాలపై ఒక రకం క్లాత్ను వేసి, దానిపై మండుతున్న క్లాత్ను నిర్ణీత కాలం పాటు వుంచుతారట . ఇదేమంత బాధాకరంగా వుండదని అక్కడివారు చెబుతారు. అయితే కార్యక్రమం అంతా నిపుణుడైన వైద్యుని పర్యవేక్షణలోజరుగుతుందట

ఈ జలుబు తో పాటు భయపెట్టేది ఇంకొకటి కూడా ఉందండోయ్ అదే ఈ సోమవారం. ఈ జలుబన్నా చెప్పా పెట్టకుండా ఎప్పుడో ఒకసారి వస్తుంది కాని ఈ  సోమవారం మాత్రం చెప్పి మరీ  ప్రతీ వారం వస్తుంది వచ్చేసింది ఇక ఆఫీసు కి బయల్దేరాలి .   




28, మే 2016, శనివారం

తొందరగా పడుకోవాలి ఏ వార్తలు చూస్తూనో

చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళే వయసులో నేనెప్పుడూ  పేపర్ లో సినిమా పేజి లాస్ట్ లో స్పోర్ట్స్ పేజి తప్ప ఇంకే పేజీ చూసేవాడిని కాదు (ఇప్పటికి అంతే అనుకోండి ).  మా నాన్న ఎంత మొత్తుకున్నాసరే వార్తలు వినడం లాంటివి అస్సలు చేసేవాడిని కాదు  . దూరదర్శన్ లో వచ్చే పందుల పెంపకం అయినా చూసేవాడిని కాని ఎందుకో వార్తలు అంటే మాత్రం అక్కడినుంచి ఏదో వంకతో వెళ్ళిపోయేవాడిని. ఒక వేళ మా నాన్న వార్తలు చూస్తే తెలివి పెరుగుతుంది లోక జ్ఞానం కలుగుతుంది అని శ్రీ కృష్ణ భగవానుడి టైపు లో ఉపదేశం చేస్తే  తప్పక వార్తలు వినడానికి/చూడటానికి  టి.వి ముందు కూచునేవాడిని. అదేమీ విచిత్రమో రోజూ శాంతి స్వరూపే వచ్చేవారో  లేక నేను వార్తలు చూసే రోజే ఆయన వచ్చేవారో  తెలీదు కానీ ఆయన వార్తలు చదువుతుంటే   జోల పాడినట్లు ఉండటంతో కాసేపటికే నిద్ర వచ్చేసేది. (1980 టైం లో లేదా అంతకు ముందు పుట్టిన వాళ్లకు శాంతి స్వరూప్ గారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా). జోలపాటలు వినకుండా సారీ వార్తలు వినకుండా నేను నిద్ర పోయానని మళ్లీ మా నాన్న  శ్రీ కృష్ణ భగవానుడి టైపు లో ఉపదేశం మొదలు పెట్టేవారు. 

అలా ఏ చీకు చింతా లేకుండా బతికేస్తున్న రోజుల్లో  సోషల్ పరీక్షల్లో అనుకుంటా చివర్లో ఒక ప్రశ్న రాజకీయాల మీద ఉండేది. అందులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్న వస్తే సమాధానం తెలియక ఇబ్బంది పడేవాడిని అదే తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్న వస్తే మాత్రం సంతోషమేసేది ఎందుకంటే జయలలితో  లేక కరుణానిధో వీళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు అని గుడ్డి నమ్మకం. వీళ్ళలో ఎవరి పేరు రాసిన 50% ఛాన్స్ ఉండేది నేను రాసిన ఆన్సర్ కరెక్ట్ అవడానికి. ఇది 20 సంవత్సరాల కిందటి మాట.

20 సంవత్సరాల తర్వాత  ఇప్పుడు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు (మధ్యలో పనీర్ సెల్వం Exception ఇక్కడ)  అని నన్నెవరన్నా అడిగితే ఇప్పటికీ అదే 50% ఛాన్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి నాకు ఉంది  :) ఇప్పటికీ అదే జయలలిత అదే కరుణానిధి. 

ఇక నిద్రపోయే టైం అయింది తొందరగా పడుకోవాలి ఏ వార్తలు చూస్తూనో. ఇదెక్కదికి పోయింది కనపడి చావడం లేదు అదేనండి రిమోటు . ఒక రెండు మూడు రిమోట్ లు తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో ఒకటి కాకపోతే ఇంకోటైనా కనపడుతుంది .  T.V అమ్మేవాళ్ళే ఒక రెండు ఎక్స్ట్రా రిమోట్లు ఇస్తే బాగుండు నా లాంటి వాళ్ళ కోసం. 

26, మే 2016, గురువారం

బ్రహ్మోత్సవం - ఒక మంచిమాట అనుకుందాం

చిన్నప్పుడు ఒక కథ వినే వాడిని. ఒక బ్రాహ్మణుడు సంతలో కొన్నదో లేక ఎవరో దానం చేసినదో ఒక మేకను తీసుకొని వెళ్తుంటే ముగ్గురు దొంగలు ఆ మేకను కొట్టేయాలి అని ప్లాన్ చేస్తారు. ముగ్గురూ వేరు వేరు చోట్ల ఆ బ్రాహ్మనుడికి ఎదురుపడి అది మేక కాదు కుక్క అని భ్రమ కలిగిస్తారు. దాంతో అతను అది కుక్కేనేమో అని అనుమానపడి ఊర్లోకి దాన్ని తీసుకెళితే అందరూ నవ్వుతారని మేకను అక్కడే వదిలేసి వెళ్తాడు.

ఇప్పుడు ఈ కథ ఎందుకు గుర్తుకు వస్తోంది అంటే సినిమా మీద రివ్యూయెర్లు ఇచ్చే రివ్యూ చూసి ఛాలా మంది జనాలు సినిమా చూడక ముందో చూసిన తర్వాతో అవి చదివేసి అదే వాళ్ళ అభిప్రాయంగా భ్రమపడి పోతున్నారు. మెదడులో ఏ మూలో ఈ రివ్యూలు కూర్చుని ఉండటం వల్ల ఒక వేళ ఆ సినిమా వాళ్ళకు నచ్చినా నచ్చలేదు అని అందరితో చెప్తున్నారు.

చెప్పాలంటే బ్రహ్మోత్సవం  అందరూ అంటున్నట్లు మరీ అంత చెత్త సినిమా  కాదేమో అని నా అభిప్రాయం. నా వరకు ఐతే పర్వాలేదు చూడచ్చు అని అనిపించింది. ఎందుకు బాగుంది ఎందుకు బాగాలేదు అని విశ్లేషించడం లేదు ఇక్కడ.

మా నాన్నకు కడప కు ట్రాన్స్ఫెర్  అయిన కొత్తలో నన్ను అక్కడే ఒక స్కూల్ లో చేర్చారు. అప్పుడు నేను పదవ తరగతి చదువుతూ ఉండేవాడిని. ఒక రోజు కొంత మంది మిత్రులు సాయంత్రం జురా సిక్ పార్క్ కు వెళ్తున్నాం నువ్వు వస్తావా అని అడిగారు . నేను లంచ్ టైం లో ఇంటికి వెళ్ళినపుడు అమ్మ తో అదే చెప్తే సరేనంది. సాయంత్రం స్కూల్ అయ్యాక వాళ్ళతో కలిసి వెళ్లాను . దారిలో తెలిసింది ఏమిటంటే వాళ్ళు వెళ్తున్నది సినిమా కు అని. అంతవరకూ నేను జురా సిక్ పార్క్ అంటే అదేదో పార్క్ పేరు అనుకున్నాను . ఎర్ర బస్సు ఎక్కి వచ్చినవాడిని కదా ఇంగ్లీష్  సినిమా ల గురించి నాకు అసలేమి తెలీదు. ఎలాగైతేనేమి ఆ సినిమా చూసిన తర్వాత కలిగిన ఆ ఫీలింగ్ మాటల్లో రాయడం చాలా కష్టం . సినిమా  గురించి అసలేమి తెలియకుండా ఫ్రెష్ మైండ్ తో వెళ్తే కలిగే ఆ ఫీలింగ్ వేరు అని నా అభిప్రాయం. అది ఇప్పుడు మిస్ అవుతున్నామేమో  అని అనిపిస్తోంది.

24, మే 2016, మంగళవారం

Bramhotsavam Choosaanoch

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లో లేక లేడి కి లేచిందే పరుగు అన్నట్లో, కొత్తగా బ్లాగు మొదలెట్టాను కదా ఎదో రాయాలి అని తహ తహ అందుకే ఈ పోస్టు.

వీకెండ్ 30 డాలర్స్ పెట్టి సినిమా కు వెళ్ళాను. ఒక లోకల్ ఫ్రెండు అదేమైనా 3డి సినిమా నా..ఎందుకంత రేటు? అని అడిగాడు. తెలుగు సినిమాలు అంతే తెలుగు సినిమాలు అంతే అన్నాను.

సినిమా హల్లో కూర్చున్నప్పుడు చిన్నప్పటి నేల టికెట్ రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటె కాస్త లేటుగా టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి మరీ స్క్రీన్ కు దగ్గరగా కూర్చోవలసి వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో చూపించిన పాపను మళ్ళీ సెకెండ్ హాఫ్ లో చూపిస్తే ఏమైనా అద్భుతం చూపిస్తారేమో అనుకున్నాను కానీ అలాంటిదేమి లేదు.


సినిమా మొదలు అయినప్పటినుంచి పాటలే పాటలు. పోకిరి మాటల్లో చెప్పాలంటే Family Family పాటలు పాడుకుంతూ డ్యాన్సులు వేసుకుంటూ బతికేస్తుంటారు . మహేష్ బాబు ఎందుకు అంత గొప్పవాడో తెలీదు కాని అందరూ అతన్ని పొగిడేస్తుంటారు సినిమా మొదలు అయినప్పటినుంచి. పెద్ద పెద్ద అర్టిస్టులను పెడితే రిచ్ లుక్ వస్తుందనుకున్నారేమో తెలీదు కాని చాలా మంది పెద్ద అర్టిస్టులు కనపడతారు.

కానీ నాకెందుకో ఆ డిష్యుం డిష్యుం సినిమా లతో, చెంప దెబ్బ కామెడిలతో పోలిస్తే మాత్రం ఇదే మంచి సినిమా అనిపించింది. ఎందుకంతే అంతకు ముందు రోజు రాత్రే ఆగడు అనే తల తిక్క చిత్ర రాజమును టి.వి లో వీక్షించితిని కనుక.

Modati blog

ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఒక బ్లాగ్ రాద్దామని. బ్లాగ్ యే విషయం మీదా అయినా రాయొచ్చు అని బ్లాగ్ పేరు 'కాదేదీ బ్లాగ్ కు అనర్హం' అని పెట్టాను. ఈ బ్లాగ్ ఆరంభ శూరత్వమో కాదో కాలమే నిర్ణయించాలి.